నిగమ్ బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు..
పాడె మోసిన రాహుల్ గాంధీ
హాజరైన ప్రముఖులు
భారత మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త, ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో శనివారం మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో మౌనమునికి అంతిమ వీడ్కోలు పలికారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంతిమయాత్ర సమయంలో మన్మోహన్ కుటుంబ సభ్యుల వెన్నంటే ఉన్నారు. పాడె మోశారు.
అంత్యక్రియల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజుతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు కర్ణాటక సీఎం, కాంగ్రెస్ నేతలు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, భూటాన్ రాజు కేసర్ నామ్ గేల్ వాంగ్ చుక్, పలువురు విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. చివరిసారిగా మన్మోహన్ సింగ్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించి కన్నీటి వీడ్కోలు పలికారు.
ప్రముఖుల నివాళులు..
మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో తుదిశ్వాస విడించారు. శుక్రవారం మన్మోహన్ పార్ధివదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు మన్మోహన్ పార్దీవ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. శనివారం ఉదయం నివాసం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్ పార్దివ దేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలతోపాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఎంపీ మల్లు రవితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మన్మోహన్ పార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి నిగమ్ బోధ్ ఘాట్ వరకు అంతిమయాత్ర కొనసాగింది.
భారీ సంఖ్యలో హాజరైన కాంగ్రెస్‌శ్రేణులు, అభిమానులు..
అంతిమయాత్ర సమయంలో రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యుల వెన్నంటే ఉన్నారు. అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పాల్గొని మన్మోహన్ కు తుది వీడ్కోలు పలికారు. అంతిమయాత్ర అనంతరం నిగమ్ బోధ్ ఘాట్ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. సిక్కు సంప్రదాయం ప్రకారం.. చితి ముట్టించడానికి ముందు ప్రార్ధనలు నిర్వహించారు. గురు గ్రంథ్ సాహెబ్ లోని వాఖ్యాలను చదివి వినిపించారు. అనంతరం మన్మోహన్ గౌరవార్ధం సైనికులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
#WATCH | Former Prime Minister #DrManmohanSingh laid to rest with full state honours after leaders and family paid last respects at Nigam Bodh Ghat in Delhi.
(Source: DD News) pic.twitter.com/Kk9RMgOMz1
— ANI (@ANI) December 28, 2024