AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిగ‌మ్‌బోధ్ ఘాట్‌లో నేడు మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ అంత్య‌క్రియ‌లు..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్ధివ దేహానికి అంత్య క్రియలు శనివారం అధికారిక లాంఛనాలతో జరుగుతాయని కేంద్ర హోంశాఖ శుక్రవారం తెలిపింది. ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో శనివారం ఉదయం 11.45 గంటలకు ఆయన అంతిమ సంస్కారాలు జరుగుతాయని పేర్కొంది. సైనిక లాంఛనాలతో ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రక్షణ శాఖను కోరినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.

మ‌న్మోహ‌న్ స్మారక స్థ‌లం నిర్మించండి.. ప్ర‌ధాని మోదీకి ఖ‌ర్గే లేఖ‌

ఇదిలా ఉంటే, మన్మోహన్ సింగ్‌కు అంత్య క్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దేశానికి రెండు సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ కు స్మారక స్థలం ఏర్పాటు చేసే విషయమై శుక్రవారం ఉదయం ప్రధాని మోదీతో ఫోన్ లో ఖర్గే మాట్లాడారు. తాజాగా ఈ అంశంపై రెండు పేజీల లేఖ రాసిన ఖర్గే, రాజ నీతిజ్ఞులు, మాజీ ప్రధానులకు అంత్య క్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలు నిర్మించిన సంప్రదాయం ఉందని గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయ స్థానం కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వం అని కొనియాడారు.

ఆయ‌న నివాసంలోనే మ‌న్మోహ‌న్ పార్దివ దేహం

ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో గల మన్మోహన్ సింగ్ నివాసంలో ఆయన పార్ధివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు అక్కడ నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలిస్తారు. ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం ఏఐసీసీ కార్యాలయంలో ఉంచుతారు. తదుపరి మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

ANN TOP 10