ఫార్ములా ఈ– రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశం మేరకు ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దన్న ఉత్తర్వులను ఈ నెల 31వ తేదీ వరకు కోర్టు పొడిగించింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని వారం రోజుల క్రితం హైకోర్టు ఏసీబీని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో.. కేటీఆర్‌కు భారీ ఊరట లభించినట్టయింది.
ఫార్ములా ఈ–రేసు వ్యవహారంలో తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టేయాలని కోరుతూ ఈ నెల 21వ తేదీన కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ మీద విచారించిన న్యాయస్థానం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఈ కేసులో విచారణను కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొంటూనే.. కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
ఇప్పటికే దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2 అర్వింద్ కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు పేర్కొనగా.. ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు జారీ చేయకపోవటం గమనార్హం. కాగా.. నోటీసులు జారీ చేసేందుకు కావాల్సిన పూర్తి స్థాయి సమాచారంతో అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. ఎప్పుడు నోటీసులు ఇస్తారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది.