మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడించారు. మన్మోహన్ సింగ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రులు సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సహా దేశంలోని రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
మన్మోహన్ సింగ్ మృతిపట్ల కేంద్ర ప్రభుత్వం సంతాపం తెలిపింది. శుక్రవారం జరగాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. ఏడు రోజులు జాతీయ సంతాప దినాలుగా కేంద్ర ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనుంది. మరోవైపు మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తరలించారు. మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.
మన్మోహన్ సింగ్ మృతిపట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. విలువలకు, సమగ్రతకు పట్టం కట్టిన మన్మోహన్ నిర్ణయాల్లో మానవీయ విలువకు ప్రాధాన్యం ఇచ్చేవారని, చరిత్రలో ఆయన స్థానం గొప్పది అని అన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
మరోవైపు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.