పుష్ప-2 సినిమా సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె 9 ఏళ్ల కుమారుడు తీవ్ర గాయాలతో 20 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇటీవలె హీరో అల్లు అర్జున్ అరెస్ట్, జైలుకు వెళ్లడం, ఆ వెంటనే బెయిల్‌పై బయటికి రావడంతో.. హాట్ టాపిక్‌గా మారింది. ఇక మంగళవారం విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు ఇచ్చిన నోటీసులతో.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌ను పోలీసులు దాదాపు మూడున్నర గంటలపాటు ప్రశ్నలు అడిగారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్పందించిన అడ్వకేట్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి.. అల్లు అర్జున్ మళ్లీ జైలుకు వెళ్తారని తేల్చి చెప్పారు.
తాజాగా హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన లాయర్ పోడూరి శ్రీనివాస్ రెడ్డి.. అల్లు అర్జున్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన.. అల్లు అర్జున్‌పై కేసు నమోదై.. జైలుకు వెళ్లి వచ్చారని తెలిపారు. అయితే అల్లు అర్జున్‌కు బెయిల్ కొద్ది రోజులకు మాత్రమే వచ్చిందని పేర్కొన్న లాయర్ శ్రీనివాస్ రెడ్డి.. అది కూడా మరో 2, 3 రోజుల్లో రద్దు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెయిల్ రద్దు అయితే అల్లు అర్జున్ మళ్లీ జైలుకు పోవడం ఖాయమని తెలిపారు.