సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి విచారణ వాడీవేడిగా కొనసాగుతోంది. పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న హీరో అల్లు అర్జున్ ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లారు. అక్కడి ఏసీపీ రమేష్ , సీఐ రాజు ఆధ్వర్యంలో, అల్లు అర్జున్ అడ్వొకేట్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగుతోంది. మొత్తం 18 ప్రశ్నలతో కూడిన పేపరను ఏసీపీ రమేష్ , కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ (Allu Arjun)కు అందజేశారు. ఆ ప్రశ్నల ఆధారంగా ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు.
ముందుగా ఈనెల 4న ప్రీమియర్ షో రోజున సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట జరిగిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా అల్లు అర్జున్ను ప్రశ్నించడం మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా శనివారం ప్రెస్మీట్లో బన్నీ మాట్లాడిన మాటలపై ప్రధానంగా పోలీసులు ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. బెయిల్పై ఉన్న వ్యక్తి రూల్స్ విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరైనా విషయమా అని పోలీసులు ప్రశ్నించగా.. అల్లు అర్జున్ నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. విచారణ సందర్భంగా అవసరం అయితే సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉందని పీఎస్ ఆవరణలో జోరుగా ప్రచారం జరుగుతోంది.