జపాన్‌కు చెందిన రెండు ప్రముఖ కంపెనీలు(Nissan-Honda Merger) ఇప్పుడు ఒక్కటయ్యాయి. నిస్సాన్, హోండా కంపెనీలు జతకలిశాయి. ఈ విషయాన్ని ఆ కంపెనీలు ఇవాళ సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేశాయి. నిస్సాన్ అలియన్స్ సభ్యుడు మిత్‌సుబిషి మోటార్స్ కూడా ఈ కలియికకు అంగీకరించింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆటోమేకింగ్ కంపెనీగా ఏర్పడబోతున్నట్లు ఆ రెండు కంపెనీలు సంయుక్తంగా ప్రకటించాయి.
హోండా ప్రెసిడెంట్ తోషిహిరో మైబ్ మాట్లాడుతూ.. జాయింట్ హోల్డింగ్ కంపెనీ కింద హోండా, నిస్సాన్ తమ ఆపరేషన్స్ చేపట్టనున్నట్లు వెల్లడించారు. తొలుత హోండా కంపెనీ ఈ కొత్త మేనేజ్మెంట్‌ను లీడ్ చేయనున్నది. రెండు కంపెనీలకు చెందిన సూత్రాలు, బ్రాండ్ ఇమేజ్‌లను కాపాడుకోనున్నారు. జూన్ వరకు మరోసారి అగ్రిమెంట్‌పై ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. ఆగస్టు 2026 నాటికి డీల్ పూర్తి అవుతుందన్నారు.
జపాన్‌కు చెందిన టోయోటా కంపెనీతో పాటు జర్మనీకి చెందిన ఫోక్స్‌వాగన్ కంపెనీకి .. ఇక త్వరలో కొత్త కంపెనీ పోటీ ఇవ్వనున్నది. జపాన్ కంపెనీల్లో టోయోటా లీడింగ్‌లో ఉన్నది. మాజ్దా మోటర్ కంపెనీతో టెక్నాలజీ షేర్ చేసుకుంటోంది టొయోటా. 2023లో హోండా 40 లక్షలు, నిస్సాన్ 34 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసింది. మిత్‌సుబిషి మోటార్స్ కేవలం పది లక్షలు మాత్రమే ఉత్పత్తి చేసింది. హోండాతో కలిసిపోతున్నట్లు వార్తలు రాగానే.. ఒక్కసారిగా నిస్సాన్ షేర్లు దూసుకెళ్లాయి.