చివరికి తండ్రి మృతి
తల్లిదండ్రులతో కొంతమంది పిల్లలు మారాం చేస్తుంటారు. నాకది కావలంటే అది ఇచ్చేవరకు వాళ్లని వదలిపెట్టరు. అలా ఇవ్వకపోతే ఇంట్లో గొడవపడటం, దూరంగా వెళ్లిపోవడం లాంటి పనులు చేస్తుంటారు. ఇలా తల్లిదండ్రులతో గొడవపడిన ఓ కుమారుడు చివరికి తన తండ్రి ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డిలోని విద్యాసాగర్ కాలనీలో మహమ్మద్ సలీం(55), రేష్మాబేగం దంపతులు ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుర్లు ఉండగా.ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు కలీం. అయితే కలీంకు రెండేళ్ల క్రితమే పెళ్లైంది. కానీ అతను తాగుడుకు బానిసవ్వడంతో భార్య అతడ్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. కలీం మాత్రం ఏ పనిచేయకుండా జల్సాలకు అలవాటు పడిపోయి తిరిగేవాడు. డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులతో ప్రతిరోజు గొడవ పడేవాడు.
ఇటీవల సలీం దుబాయ్ వెళ్తానని అందుకోసం డబ్బులు ఇవ్వాలంటూ తన తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. అయితే వారు వారం రోజుల్లో ఇస్తామని చెప్పిన వినలేదు. చివరకి శుక్రవారం సాయంత్రం వారితో కలీం గొడవపడ్డాడు. డబ్బులు ఇస్తారా లేదా చావమంటారా ఇంటూ బెదిరించాడు. డబ్బులివ్వకపోతే ముగ్గురం చనిపోదామంటూ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. ముగ్గురు నీటిలో దిగారు. కలీం తండ్రి సలీం కొంచెం లోతులోకి వెళ్లడంతో మునిగిపోయాడు. దీంతో కలీం భయంతో తల్లిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. విషయం తెలుసుకున్న బంధువులు సలీం మృతదేహాన్ని బయటకు తీశారు. రేష్మాబేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.