AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జమిలి ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌.. వన్‌ నేషన్‌..వన్‌ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఈ శీతాకాల సమావేశాల్లోనే ఉభయసభల ముందుకు

అన్నీ అనుకున్నట్టే జరిగితే  2027లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు!

దేశంలో వన్‌ నేషన్‌..వన్‌ ఎలక్షన్‌ అమలులో కీలక ముందడుగు పడింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ అందించిన సిఫార్సులకు గురువారం కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ జమిలి ఎన్నికల బిల్లును ఉభయసభల ముందుకు ప్రవేశపెట్టేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే 2027లో దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.

పట్టుదలతో మోదీ సర్కార్‌..
బీజేపీ కోర్‌ అంశాల్లో కీలకమైన జమిలి ఎన్నికలు తీసుకువచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే దేశం మొత్తం ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేలా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకే దేశం ఒకే ఎన్నికకు విధివిధానాలు, సాధ్యాసాధ్యాల కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఒక కమిటీని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక ఆ కమిటీ కొన్ని నెలల పాటు విశ్లేషణలు, అభిప్రాయాలు సేకరించి ఒక రిపోర్ట్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అయితే ఆ కోవింద్‌ కమిటీ సిఫార్సులకు తాజాగా గురువారం నరేంద్ర మోదీ అధ్యక్షత భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం.. ఆమోదముద్ర వేసింది.

కోవింద్‌ కమిటీ సిఫార్సులకు..
అయితే కోవింద్‌ కమిటీ సిఫార్సులకు కేంద్ర కేబినెట్‌ గతంలోనే ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ బిల్లును లోక్‌సభ, రాజ్యసభల ముందుకు తీసుకురావాలని నరేంద్ర మోదీ సర్కార్‌ యోచిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జమిలి ఎన్నికల సిఫార్సులకు కేంద్ర కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. దీంతో జమిలి ఎన్నికలకు సంబంధించిన సమగ్ర బిల్లు పార్లమెంట్‌ ముందుకు చర్చకు రానుంది. దేశంలో లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశ ప్రగతికి ఆటంకం కలుగుతోందని బీజేపీ వాదిస్తోంది.

18,626 పేజీల సమగ్ర నివేదిక..
దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రామ్‌నాథ్‌ కోవింద్‌.. 18,626 పేజీల సమగ్ర నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. 2023 సెప్టెంబర్‌ 2వ తేదీన వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌కు సంబంధించిన నివేదికను ప్రారంభించారు. పలువురు నిపుణులు ఆధ్వర్యంలో 191 రోజుల సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ రిపోర్ట్‌ను పూర్తిచేశారు. ఇందులో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని.. ఆ తర్వాత 100 రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని కోవింద్‌ కమిటీ సిఫారసు చేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10