ప్రాణహాని ఉందని చెప్పినా భద్రత కల్పించలేదని ఆరోపణలు
తన నివాసం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటుకు విజ్ఞప్తి
ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో పోలీసులు మోహన్‌బాబుకు నోటీసులు పంపించారు. బుధవారం ఉదయం విచారణకు రమ్మని పిలిచారు. దీంతో పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మోహన్‌బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరినా పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. తనకు భద్రత ఏర్పాటు చేయాలని, తన నివాసం వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మోహన్‌బాబు తరఫున లాయర్లు నగేశ్ రెడ్డి, మురళీమనోహర్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
జర్నలిస్టులపై దాడితో..
జల్‌పల్లిలోని మంచు ఫ్యామిలీ ఫాంహౌస్ వద్ద మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు.. మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పహాడీ షరీఫ్ పోలీసులు బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నటుడు మోహన్ బాబుకు నోటీసులు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 గంటలకు రాచకొండ కమిషనరేట్ లో విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై తాజాగా మోహన్‌బాబు హైకోర్టును ఆశ్రయించారు.