AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అదే.. నాన్న చేసిన తప్పు!.. మీడియా ఎదుట మంచు విష్ణు

మమ్మల్ని అమితంగా ప్రేమించడమే..
ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా దాడి చేయలేదు

మంచు ఫ్యామిలీ వివాదం మరింత ముదిరిన నేపథ్యంలో మోహన్‌బాబు కుమారుడు మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మమ్మల్ని అమితంగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు అని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా నాన్న దాడి చేయలేదు. మంగళవారం జరిగిన దాడిలో ఒక విలేకరికి గాయాలవడం దురదృష్టకరం అన్నారు. అతని కుటుంబంతో మాట్లాడామని.. అవసరమైన సాయం చేస్తామని ఆయన తెలిపారు.

కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాం..
‘మాది ఉమ్మడి కుటుంబం. మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాం. దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపెడుతోంది. ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా. మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు. ప్రతీ కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి. ఈ విషయాన్ని సెన్సేషన్‌ చేయొద్దు. ఇది నా రిక్వెస్ట్‌. ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది. ప్రజల్లోకి తీసుకువెళ్లడం కరెక్టే కానీ, కొంతమంది హద్దులు మీరి వ్యవహరిస్తున్నారు. ఈరోజు అమ్మ ఆస్పత్రిలో చేరారు. ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి. కన్నప్ప సినిమా కోసం లాస్‌ఏంజెల్స్‌లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్‌ వచ్చింది. అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశాను. అన్నింటికంటే కుటుంబం ముఖ్యం. నిన్న ఉదయాన్నే హైదరాబాద్‌ వచ్చా. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఊర్లో లేని నాలుగు రోజుల్లో ఇది అంతా జరిగిపోయింది.

నేను ఉంటే ఇలా జరిగేది కాదు..
‘ఇది మా కుటుంబ విషయం. ఈ విషయంలో భాగమైన బయటవాళ్లకు బుధవారం సాయంత్రం వరకూ అవకాశం ఇస్తున్నా. వాళ్లంతట వాళ్లే వెనక్కి తగ్గాలి. లేదంటే వాళ్ల పేర్లు నేనే బయటపెడతా. మా నాన్న మాటే నాకు వేదవాక్కు. ఆయన ఏం చేసినా నేను దాన్నే పాటిస్తా. నేను దాడులు చేయను. నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఫిర్యాదులు, మా నాన్న ఆడియో సందేశం బయటకు వచ్చేది కాదు. నేను లాస్‌ ఏంజిల్స్‌ నుంచి వచ్చేప్పుడు మా అమ్మ కాల్‌ చేసి ఏడ్చారు. నేను ఇక్కడ ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. మీడియా వాళ్లకు నాది ఒకటే విజ్ఞప్తి. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మా జీవితాలను సర్కస్‌ చేయకండి. నేను సీపీని కలుస్తాను. చట్టపరంగా దీనిపై పోరాటం చేస్తా. ప్రేమతో గెలవాల్సిన దానికి గొడవలు మార్గంగా ఎంచుకున్నారు. నేను నా కుటుంబం గురించి బయట మాట్లాడను. మా నాన్న స్వయంకృషితో ఎదిగారు. ఇది ఆయన కష్టార్జితం. ఆయన లేకపోతే మేము లేము. తన ఇంట్లో ఉండొద్దు అని ఆయన అంటే.. ఉంటాను అనే హక్కు నాకు లేదు. ఆయన మాటకు గౌరవం ఇవ్వాలి. వినయ్‌ను నాన్న కొడుకులా చూస్తారు. అతడిని కొట్టేంత ధైర్యం ఎవరూ చెయ్యరు. భారతదేశంలో ఐఐటీలను చాలెంజ్‌ చేసిన ఘనత మా యూనివర్సిటీకి ఉంది. అది మాకు దేవాలయం. దాని గురించి తప్పుగా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. లక్ష్మికి, నాకు మధ్య కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మేమిద్దరం మర్యాదగా వ్యవహరిస్తుంటాం. ఉదయం నాకు పోలీసుల నోటీసులు వచ్చాయి. పోలీసు విచారణకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. కానీ, వ్యవస్థపై గౌరవం ఉంది కాబట్టి సీపీని కలుస్తా’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు

ANN TOP 10