మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య బాహాబాహీ
మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత..
ఘటనాస్థలానికి పోలీసులు
మంచు కుటుంబంలో గొడవలు తారస్థాయికి చేరాయి. జల్‌పల్లిలోని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ఫామ్ హౌస్ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంచు మనోజ్ బౌన్సర్లు మరో వైపు విష్ణు బౌన్సర్లు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లును బయటకు తోసేశారు. మోహన్ బాబు ఫామ్‌హౌస్‌కు పహడి షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మంచు మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
సీసీ ఫుటేజీని మాయం చేశారు: మంచు మనోజ్
తండ్రి మోహన్ బాబు తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజీæ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని విజయరెడ్డి, కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్లిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ పాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశానన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానన్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని తీసుకు రావడం చాలా బాధాకరమని అన్నారు. కొన్నాళ్లగా ఆ ఇంటి నుంచి దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, అన్న విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసునని అన్నారు.
ముదిరిన వివాదం..
మంచు కుటుంబంలో అగ్గి రాజుకుంది. సోమవారం అది ఊహించని మలుపులు తిరిగి పెద్ద మంటలా మారింది. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్ .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్‌బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరూ కొట్టుకున్నట్లు ఆదివారం మీడియా వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేశాయి. అదంతా నిజం కాదని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్ బాబు ట్విటర్‌లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంఎల్‌సీ (మెడికల్ లీగల్ సర్టిఫికెట్) చేయించిన మనోజ్ ఆ మెడికల్ రిపోర్టులతో సహా.. వెళ్లి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆదివారం పది మంది గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేశారని, వారిని అడ్డుకునే సమయంలో తన దాడి చేశారనీ, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.