కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు పోలీసు కస్టడీ విధించింది. లగచర్ల దాడి కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న నరేందర్ రెడ్డిని రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతినిచ్చింది. న్యాయవాది సమక్షంలోనే ఈ విచారణ జరపాలని పోలీసులను ఆదేశించింది.
లగచర్ల దాడి కేసులో విచారణ చేసేందుకు పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. నరేందర్ రెడ్డిని రెండు రోజుల పోలీసు కస్టడీకీ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం ఉదయం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలు నుంచి వికారాబాద్‌కు తరలించనున్నారు. అక్కడే రెండు రోజుల పాటు పోలీసులు ఆయన్ను ప్రశ్నించనున్నారు.