AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది : ఎమ్మెల్సీ కవిత

ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గచ్చిబౌలి పీఎస్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె గచ్చిబౌలి స్టేషన్‌కు చేరుకొని బీఆర్‌ఎస్‌ నేతలను కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పాడి కౌశిక్ రెడ్డి ఏసీపీకి ఫోన్ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకొని బంజారాహిల్స్ స్టేషన్‌కు వెళ్లారన్నారు. అక్కడ ఏసీపీ లేకపోవడంతో సీఐని ఫిర్యాదు తీసుకోవాలని పాడి కౌశిక్‌రెడ్డి కోరారన్నారు. సీఐని ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ఉదయం 10 గంటలకు అరెస్టు చేస్తే ఇప్పటి వరకు రిమాండ్ చేయలేదని ఆరోపించారు.

పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినందుకు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు ఇతర నేతలను అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఫిర్యాదు తీసుకునే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజు వస్తుందని.. పాడి కౌశిక్‌రెడ్డిపై కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలను కోర్టు మూసిన తర్వాత పంపించాలనే జాప్యం చేస్తున్నారని.. ఇందిరమ్మ రాజ్యం కాదని.. పోలీసుల రాజ్యం నడుస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీని తలపిస్తుందని.. అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ANN TOP 10