మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఫడ్నవీస్‌తోపాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ సైతం ప్రమాణం చేశారు. వారితో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. ముంబయిలోని ఆజాద్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, శివరాజ్‌సింగ్ చౌహాన్, రాందాస్ అథవాలే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
అలాగే, వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్-అంజలి దంపతులు, బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవలే జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. కూటమిలోని బీజేపీకి 132 సీట్లతో అధిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేనకు 57, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి.
దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ జనసంఘ్, బీజేపీలో చురుగ్గా పని చేశారు. 1989లో ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఫడ్నవీస్ 22 ఏండ్ల వయసులోనే నాగ్‌పూర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 1997లో 27ఏండ్లకే మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1999 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన ఆయన.. 2014లో మొదటిసారి మహారాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు. 2019 నవంబర్ 23న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అయితే, సరిపడా శాసనసభ్యుల బలం లేకపోవడంతో మూడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2022 జూన్‌లో శివసేనలో షిండే తిరుగుబాటు చేసి సీఎం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. షిండే కేబినెట్‌లో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.