ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు
లబ్ధిదారుల ఎంపికలో వారికి ప్రత్యేక కోటా
ప్రత్యేక యాప్ లాంచ్ చేసిన సీఎం
తెలంగాణలోని ఇల్లులేని పేదలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇంటిని త్వరలోనే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో గురువారం మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఇండ్లులేని పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఒక వేళ స్థలం ఉండి వారే కట్టుకుంటే ప్రతి ఇంటి నిర్మాణానికి పేదవాడికి.. రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఆదివాసీలు, చెంచులకు ప్రత్యేక కోటా ఉంటుందని చెప్పారు.
ప్రత్యేక యాప్ ఆవిష్కరణ..
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం డిజైన్ చేసిన ప్రత్యేక యాప్, మోడల్ హౌస్ నిర్మాణాలను సీఎం రేవంత్ లాంచ్ చేశారు. సెక్రటేరియట్ వేదికగా.. డిప్యూటీ సీఎం భట్టి, తెలంగాణ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతామని అన్నారు. ఇందు కోసం ఈ ఏడాది రూ. 22,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.
లబ్ధిదారులను గురించేందుకే మొబైల్ యాప్..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రజాపాలనలో అందిన అఫ్లికేషన్ల ఆధారంగా లభ్దిదారులను గుర్తించేందుకు మొబైల్ యాప్ సిద్ధం చేసినట్లు సీఎం వెల్లడించారు. ప్రజా పాలనలో ఎటువంటి పైరవీలకు, రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అర్హులకు మాత్రమే ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నట్టు చెప్పారు. తొలి విడతలో ఒక్కో నియోజక వర్గానికి 3500 ఇళ్లను ఈ పథకం ద్వారా కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సాయంతో పాటుగా ఆర్థిక స్థోమత ఉన్నవారు తమకు నచ్చినట్లు ఇళ్లను నిర్మించుకోవచ్చునని చెప్పారు.
నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు ప్రాధాన్యం..
తొలి విడతలో నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇక ఆదివాసీలు, ఐటీడీఏల పరిధిలో చెంచులు, ఆదివాసీ ప్రజలకు ప్రత్యేకంగా కోటా కేటాయిస్తామన్నారు. నియోజకవర్గానికి కేటాయించే 3500 ఇళ్లతో సంబంధం లేకుండా వారికి ప్రత్యేకంగా కోటా కేటాయించనున్నట్లు తెలిపారు. గొండులు, ఆదివాసీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఈ పథకంతో సంబంధం లేకుండా అదనంగా ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేక ప్యాకేజీని అందజేస్తామన్నారు. ప్రతి మండల కేంద్రంలో ఇంటి నిర్మాణాలకు ఒక మోడల్ హౌస్‌ను నిర్మిస్తామన్నారు. లబ్దిదారులు ఆ ఇళ్లను చూసి తమ ఇళ్ల డిజైన్ ఖరారు చేసుకోవచ్చునని చెప్పారు. మెుత్తం నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.5 లక్షలు జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.