AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్‌..

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ ఎన్‌.శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన కొనసాగుతారని పేర్కొన్నారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్‌ గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వలంటరీ రిటైర్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో వెంకటేశం స్థానంలో ఎన్‌ .శ్రీధర్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

1997 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన..
శ్రీధర్‌ 1997 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు. మొదట రాజమండ్రి సబ్‌ కలెక్టర్‌గా, ఊట్నూరు ఐటీడీఏ పీఓగా, పోర్ట్స్‌ డైరెక్టర్‌గా కాకినాడలో పని చేశారు. అనంతరం అనంతపురం, కృష్ణ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్‌ సెక్రటరీగా మూడేళ్ల మూడు నెలల పాటు పని చేశారు. తెలంగాణ ఏర్పాట తర్వాత నుంచి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణలోని సింగరేణి కంపెనీ కాలరీస్‌ లిమిటెడ్‌ సీఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధర్‌ స్థానంలో బలరామ్‌ను సీఎండీగా నియమించిన విషయం తెలిసిందే.

ANN TOP 10