AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొమురంభీం జిల్లాలో పెద్దపులి కోసం కొనసాగుతున్న వేట..

కొమురంభీం జిల్లాలో పెద్ద పులి కోసం వేట కొనసాగుతోంది. సిర్పూర్ మండలం పెద్దబండ ఆరేగూడ శివారులోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి కనిపించిందని స్థానికులు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ట్రాకింగ్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని మైక్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేశారు. పులి సంచరించే ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆరేగూడ శివారులో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఆరేగూడకు సంబంధించిన స్థానికులు కొందరు అక్కడున్న వాగులో పులికి సంబంధించిన పాదముద్రలు గుర్తించిన తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ అడుగులను ట్రాక్ చేస్తూ వెళ్లగా.. పెద్ద పులి ఆరేగూడ సమీపంలోని అడవిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే, మనుషులపై వరుసగా దాడులు చేసిన పులే అడవిలోకి వెళ్లి ఉంటుందా? లేదా? ఆ ప్రాంతంలో ఉన్న మరో పులి ఏదైనా కావచ్చా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరోవైపు ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో పులి తిరుగుతోంది. ఇక్కడ సంచరించడానికి ప్రజలకు అనుమతి లేదు, ఇటువైపు ఎవరూ రావొద్దు అంటూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దాంతో పాటు మైక్ ల ద్వారా పులి సంచరిస్తున్న పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పెద్ద పులి తిరుగుతోంది, ఎవరూ ఇక్కడ తిరగొద్దు, పులి దాడి చేసే అవకాశం ఉందని, రెండు రోజుల పాటు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అటు డ్రోన్ల ద్వారా టైగర్ సెర్చింగ్ కొనసాగుతోంది. డ్రోన్లు, సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాల ద్వారా పులి కదలికలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ట్రాప్ కెమెరాలకు, డ్రోన్లకు చిక్కకుండా పులి తిరుగుతోంది. రీసెంట్ గా ఒక ట్రాప్ కెమెరాకి వెనక వైపు నుంచి పులి వెళ్లింది. పులి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పులి మనుషులపై వరుసగా దాడిలకు పాల్పడుతోంది? అనేదానిపై క్లారిటీ లేదు. ఇటీవల ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలలో సంచరించి ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా నార్నూరు నుంచి జివితి మహారాష్ట్రలో మాయమైన పులి కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే పులి జివితి నుంచి వాంకిడి మీదుగా కాగజ్ నగర్ ప్రాంతంలోని అడవులకు వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10