ఎవరూ బయటకు రావొద్దంటూ అధికారుల చాటింపు
భయం గుప్పిట్లో ప్రజలు
కొమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఎప్పుడు ఎవరిపై దాడి జరుగుతుందోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రెండు రోజుల క్రితం కాగజ్ నగర్ పరిధిలో హైవే పక్కనే కనిపించిన పులి ఇప్పుడు పొలాలు, చేలల్లోకి వచ్చి మనుషులపై పంజా విసురుతోంది. శుక్రవారం ఉదయం లక్ష్మి అనే 21 ఏళ్ల మహిళపై పులి దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు అడవిని జల్లెడ పడుతున్నారు.
రైతుపై దాడితో..
ఓవైపు పులికోసం వెతుకులాట మొదలుపెడితే మరోవైపు ఈ రోజు రైతుపై దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది. రైతుకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కంది చేనులో పనిచేస్తుండగా పులి దాడి చేసినట్టు తెలుస్తోంది. వరుస ఘటనలతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే బయపడి పోతున్నారు. గ్రామాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలాల్లోకి, చేనుల్లోకి వెళ్లవద్దని అధికారులు డబ్బు చాటింపు చేస్తున్నారు. కాగజ్ నగర్ మండలంలోని ఈజ్గాం, విలేజ్ నంబర్ 1,3,5,8,9,10 గ్రామాలలో కడంబా, ఆరెగూడ, గన్నారం, సీతాగూడ గ్రామాలలో ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రామాలలో 144 సెక్షన్ విధించారు. మరోవైపు అటవీ అధికారులు డ్రోన్ సహాయంతో పులిని పట్టుకునే పనిలో ఉన్నారు. కానీ పులి మాత్రం తప్పించుకుని తిరుగుతోంది.
మహారాష్ట్ర నుంచి పులుల రాక..
ఇదిలా ఉంటే కాగజ్ నగర్ అడవుల్లోకి పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. గడ్చిరోలి అడవుల్లో నుంచి∙జిల్లాలోకి పులులు రాగా కడంబా అడవిలో గతంలో పులిపిల్లలు చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పులుల సంచారం పెరిగింది. కాగజ్ నగర్ తో పాటూ గతంలో జిల్లాలోని దెహెగాం వద్ద కూడా ఓ యువకుడిపై దాడి చేసి పులి చంపేసింది. వరుస ఘటనలు జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు మాత్రం తగిన చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.