ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
పత్తిచేనులో పనులు చేస్తుండగా ఘటన
మృతదేహంతో ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట గ్రామస్తుల ధర్నా
కొమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా భయాందోళనలకు గురి చేస్తున్న పెద్ద పులి ఏకంగా ఇప్పుడు మనుషులపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకు పశువులపై దాడి చేస్తూ వస్తున్న పులి మహిళపై దాడిచేసి ప్రాణాలు తీసింది. కాగజ్ నగర్ మండలంలోని ఈస్గాం విలేజీ నంబర్ 11లో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
బెంగాల్ క్యాంప్ 6వ నంబర్లో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళ చేనులో పత్తి ఏరడానికి వెళ్లింది. పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో పెద్దపులి ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో భయాందోళనకు గురైన తోటి కూలీలు.. పెద్దగా కేకలు వేయడంతో పులి అక్కడికి నుంచి పారిపోయింది. అనంతరం తీవ్రంగా గాయపడిన లక్ష్మిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు, స్థానికులు కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని.. లక్ష్మి కుటుంబానికి కనీసం 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మి కుటుంబానికి న్యాయం చేసేంతవరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు.
అధికారుల అలసత్వమే కారణం..
ఉన్నతాధికారుల మెప్పు పొందడం కోసం పెద్దపులులను పట్టుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అటవీ సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఇప్పటికే జిల్లాలో పులి దాడిలో ముగ్గురు, ఏనుగు దాడిలో ఇద్దరు చనిపోయారని వారు గుర్తు చేశారు. అయినా అటవీ అధికారుల్లో ఎటువంటి చలనం లేకపోవడం బాధాకరమని ఆవేదనకు గురవుతున్నారు. జంతువుల ప్రాణాలకు ఇచ్చినటువంటి విలువ మనుషుల ప్రాణాలకు ఇవ్వడం లేదని వాపోయారు.
కొన్ని రోజులుగా హడలెత్తిస్తున్నపెద్దపులి
మరోవైపు, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల క్రితం పెద్దపులి దర్జాగా రోడ్డు దాటుకుంటూ వెళ్తుండగా గమనించిన వాహనదారులు దాన్ని వీడియోలు తీశారు. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. ఫారెస్ట్ అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
ప్రజలు బిక్కుబిక్కు..
ఒంటరిగా ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని.. సాయంత్రం త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికలతో అటవీ ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. పులిని వీలైనంత త్వరగా పట్టుకుని తమ ప్రాణాలను కాపాడాలని ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. ఇటీవల అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చి.. దాడులకు పాల్పడిన ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.