బీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భవన్ ఇంచార్జి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.. ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులకు శాలువాకప్పి గౌరవప్రదంగా సన్మానించారు. అనంతరం ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా శ్రీనివాస్ రెడ్డి వాహనం వద్దకు కేసీఆర్ వచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కేసీఆర్.. ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది కేవలం నాకు జరిగిన సత్కారమే కాదు.. నాలాంటి ఎందరో తెలంగాణ వాదులకు జరిగిన సత్కారమని అన్నారు.
తెలంగాణ జాతిని మేల్కొల్పిన ఉద్యమ రథ సారథి, తెలంగాణ ప్రగతి ప్రదాత కేసీఆర్ అని శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. కేసీఆర్ వద్ద 25 ఏండ్ల పాటు పనిచేయడం తన అదృష్టమని.. తనకు దక్కిన గొప్ప అవకాశమని తెలిపారు. కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం రాకపోయేదని అన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ జీవితం అర్పితం చేశారని పేర్కొన్నారు. కేసీఆర్ మాదిరి తన ప్రజల పట్ల అంతగా నెనరున్న జననేత మరెక్కడా కానరాడని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో కేసీఆర్ స్థానం శాశ్వతంగా ఉండిపోతుందని చెప్పారు.