వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం దామగుండం అడవిలో కార్చిచ్చు అంటుకున్నది. వీఎల్‌ఎఫ్ నావీ రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీగా మంటలు అంటుకున్నట్టు స్థానికులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి దామగుండం అడవి తగలబడుతుండగా, రాత్రి 7 గంటల సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యాహ్నం నుంచి సుమారు 100 ఎకరాల వరకు దామగుండం అడవి అగ్నికి ఆహూతి అయింది. రాత్రి 10 గంటల సమయంలో దామగుండం అటవీ ప్రాంతానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు మంటలార్పుతున్నాయి. మరోవైపు, నావీ రాడార్ కేంద్రం వద్ద పనులు కొనసాగుతున్నాయని, అయినప్పటికీ అక్కడున్నవారు అడవి తగలబడుతున్న సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
మధ్యాహ్నం నుంచి అడవిలో కార్చిచ్చు అంటుకున్నప్పటికీ రాత్రి 10 గంటల వరకు అటవీ శాఖ అధికారులతోపాటు ఇతర అధికారులకు సమాచారం లేకపోవడం గమనార్హం. కార్చిచ్చుపై డీఎఫ్‌వో స్పందిస్తూ.. ఎవరో ఆకతాయిలు చేసిన పని అని, మంటలు అదుపులోనే ఉన్నాయని, అగ్నిమాపక శాఖ మంటలార్పుతున్నారని తెలిపారు. దామగుండం, మోత్కుపల్లి, అనంతగిరి ప్రాంతాల్లో గడ్డి ఎక్కువ పెరుగుతుందని, మానవ తప్పిదాలతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు.