తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో మళ్లీ జంపింగ్ గుబులు పట్టుకుందని సమాచారం. గెలిచిన 39 సీట్లలో ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. సాయన్న కూతురు లాస్య నందిత అకాల మరణంతో సికింద్రాబాద్ సీటుకు బైపోల్ వచ్చింది. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది.
దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ దగ్గర.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుతో కలిపి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు. ఇందులో ఇంకొంత మంది కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా హైకోర్టు తీర్పు తర్వాత మళ్లీ గులాబీ పార్టీలో వలసల గుబులు మొదలైందట.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసినా స్పీకర్ సకాలంలో స్పందించలేదని హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో కోర్టు తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ మధ్య కొన్నాళ్లు బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగిపోయాయన్న చర్చ జరిగింది. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్ కు టైం బాండ్ లేదని, తగిన సమయంలో డెసిషన్ తీసుకోవాలని సూచిస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్టు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా చల్లబడిపోయిందట.
ఆ తీర్పులో బీఆర్ఎస్‌లో నిరాశ
బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా హైకోర్టు వేటు వేస్తుందని ధీమాలో ఉన్న బీఆర్ఎస్‌కు తీర్పు నిరాశ కలిగించిందట. దీంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్లీ వలసలు మొదలవుతాయన్న ప్రచారం మొదలైంది. ఇందుకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, అందులో కేటీఆర్ చుట్టూ తిరిగేవారే తమతో టచ్‌లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్స్ చేశారు.