జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నా.. ఇలా బతకడం నావల్ల కావట్లేదని ఓ యువకుడు 18 నెలల తన కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నువు రెండో పెండ్లీ చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్‌నోట్ రాసిన అతడు.. మెదడు సరిగా ఎదగని బిడ్డ తన భార్య జీవితానికి అడ్డు కాకూడదని ఆమెను తీసుకుని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మోపాల్ మండలం న్యాల్‌కల్ శివారులోని చెరువులో సోమవారం తెల్లవారుజామున ఈ హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఎస్సై యాదగిరిగౌడ్, స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని సీతారాంనగర్ కాలనీ (గాజుల్‌పేట్)లో నివాసముండే రఘుపత్రి క్రాంతికుమార్ (35)కి భార్య మానస, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గురుకుల పాఠశాలలో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
దీనస్థితిలో పాపను చూడలేక..
18 నెలల కూతురికి చిన్నప్పటి నుంచి మెదడు ఎదుగుదల లేకపోవడంతో దవాఖానల చుట్టూ తిప్పితిప్పి అప్పుల పాలయ్యాడు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు, పాప ఆరోగ్య పరిస్థితి క్రాంతిని మానసికంగా వేదనకు గురిచేశాయి. దీన స్థితిలో ఉన్న పాపను చూడలేక ఆమెను తీసుకుని సోమవారం తెల్లవారుజామున తన బైక్‌పై న్యాల్‌కల్ శివారులోని చెరువు వద్దకు చేరుకున్నాడు.
చిన్నారితో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాలను వెలికి తీయించారు. మరోవైపు, క్రాంతి తన భార్యకు రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నా. అన్నింటా ఫెయిల్ అయ్యా. ఇలా బతకడం నావల్ల కావడం లేదు. నాకు చావే శరణ్యం. అందుకే నా కూతుర్ని తీసుకుని చనిపోతున్నా. నువ్వు రెండో పెళ్లి చేసుకో’ అని భార్యను ఉద్దేశించి సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు.