AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహారాష్ట్రలో 58.22, జార్ఖాండ్‌లో 67.59 శాతం పోలింగ్

ఎన్డీయే వెర్సస్ ఇండియా (NDA vs INDIA) కూటమి మధ్య హోరాహోరీ ఎన్నికల యుద్ధానికి తెరపడింది. జార్ఖాండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ బుధవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. జార్ఖాండ్‌లో రెండవది, తుదివిడత పోలింగ్ జరుగగా, మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలు కాగా, మహారాష్ట్రలో సాయంత్రం 6 గంటలతో, జార్ఖాండ్‌లో సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అప్పటి వరకూ జరిగిన పోలింగ్ శాతం ప్రకారం మహారాష్ట్రలో 58.22 శాతం, జార్ఖాండ్‌లో 67.59 శాతం పోలింగ్ నమోదైంది. అయితే, క్యూలలో నిలబడిన వారికి ఓటింగ్‌కు అవకాశం ఇవ్వడంతో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మహాయుతి కూటమిలో భాగంగా బీజేపీ 149, ఏక్‌నాత్ షిండే శివసేన 81, అజిత్ పవార్ సారథ్యంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల్లో పోటీ చేసింది. విపక్ష మహా వికాస్ అఘాడిలో కాంగ్రెస్ 101 సీట్లకు, ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన (యూబీటీ) 95 స్థానాలకు, ఎన్‌సీపీ (శరద్ పవార్) 86 స్థానాలకు పోటీ చేసింది.

జార్ఖాండ్‌లో జార్ఖాండ్ ముక్తి మోర్చా జేఎంఎం)-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి తిరిగి అధికారంలోకి వస్తామని ఆశిస్తుండగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఈసారి విజయం తమదేనని ధీమాగా ఉంది. జార్ఖాండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇండియా కూటమి భాగస్వాములైన జేఎంఎం 43 సీట్లలో, కాంగ్రెస్ 30 సీట్లలో ఆర్జేడీ 6, సీపీఐ(ఎంఎల్) ఒక స్థానంలో పోటీ చేసింది. జార్ఖాండ్, మహారాష్ట్రతో పాటు, 15 స్థానాల్లో అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్‌లో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. 14 స్థానాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 5 గంటలతో ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని కేదార్‌నాథ్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6 గంటలకు ముగిసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10