AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత

రాష్ట్రంలోని విద్యాలయాల్లో మరోసారి ఫుడ్‌పాయిజన్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. ఇది గమనించిన పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వెంటనే విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అక్కడ సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం9 మంది విద్యార్థులను మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మరో 9 మందిని మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫుడ్‌పాయిజన్‌కు గురైన ఘటనలో 8 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది.

మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో 450 మంది విద్యార్థులు చదువుతున్నారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు విద్యార్థులకు అన్నం, సాంబారుతో పాటు గుడ్డును వడ్డించారు. అయితే నాసిరకం గుడ్లు, నిత్యవసర వస్తువులతో చేసిన వంటలు తినడం వల్లే విద్యార్థులు తీవ్ర వాంతులతో స్పృహ తప్పిపడిపోయారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. చాలా రోజులుగా పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత లేని భోజనాన్ని వడ్డిస్తున్నారని తెలిపారు.

కాగా.. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాగనూరు ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య చికిత్సలను అందించాలని సూచించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిని ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని మాగనూరు ఎస్సైను ఎమ్మెల్యే ఆదేశించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10