AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది: రేవంత్ రెడ్డి ట్వీట్

దేశంలోనే వరి సాగు, ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ ను అధిగమించి చరిత్ర సృష్టించింది. వానాకాలం సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 66.77 లక్షల విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. ఏకంగా 153 లక్షల టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

“కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి, నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా… ఎన్డీఎస్ఏ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయకపోయినా… కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది. ఇది తెలంగాణ రైతుల ఘనత. వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం. తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం. ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు” అని రేవంత్ ట్వీట్ చేశారు.

రైతులకు మంత్రి ఉత్తమ్‌ అభినందనలు..

ప్రస్తుత ఖరీఫ్‌లో వరి దిగుబడిలో తెలంగాణా రికార్డు సృష్టించడంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సారి 66.77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడిని రాష్ట్ర రైతులు సాధించారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ప్రస్తుత తెలంగాణలోనూ ఈస్థాయిలో దిగుబడి మొదటిసారి అని చెప్పారు.

ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యావత్‌ భారత దేశంలోనే ఇంతటి వరి దిగుబడి అరుదైన రికార్డు అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు బ్యారేజీలు పని చేయక పోయినా వరి దిగుబడిలో అద్భుతమైన విజయాన్ని రాష్ట్రం సాధించిందని, ఇది ముమ్మాటికీ రాష్ట్ర రైతుల విజయమని పేర్కొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10