AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిన్న బాస్‌ తీరు.. కారు ఉసూరు

కేటీఆర్‌ ఒంటెత్తు పోకడ
ఎంతసేపూ కాంగ్రెస్‌ను బద్నాం చేయడమే పని..
– వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తీరుతో విస్తుపోతున్న నేతలు
– లగచర్ల వ్యవహారంతో క్యాడర్‌లో అయోమయం
– చెప్పలేక కుమిలిపోతున్న పార్టీ సీనియర్లు
– గులాబీ దళంలో గుబులు
– ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ బీఆర్‌ఎస్‌ ఖాళీ

(హైదరాబాద్, మహా):
బీఆర్‌ఎస్‌లో గందరగోళం నెలకొంది.. ఇప్పటికే అన్ని జిల్లాలోనూ క్యాడర్‌ కనుమరుగవుతున్న వేళ.. చిన్నబాస్‌ తీరుతో శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. కేటీఆర్‌ ఒంటెత్తు పోకడే ఈ పరిస్థితికి కారణమని గులాబీ శ్రేణులు బాహాటంగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న కేటీఆర్, లోకల్‌గా క్యాడర్‌లో ఉన్న సమస్యలను పట్టించుకోకపోవడం, కనీసం జంపింగ్‌లను ఆపలేకపోవడమే కారణమని పార్టీ నేతలే చెబుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలు, ఆవేశంతో తప్పుల మీద తప్పులు చేస్తున్న కేటీఆర్‌ తీరుతో సీనియర్లు సైతం విస్తుపోతున్న పరిస్థితి నెలకొంది. పోనీ ఇలా కాదని సలహాలిచ్చే ధైర్యం చేద్దామంటే ఈ సాహసం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని కుమిలిపోతున్నారట.

లగచర్ల ఘటనతో మరింత దిగజారిన పార్టీ పరువు..
లగచర్ల ఘటనతో బీఆర్‌ఎస్‌ పరిస్థితి మరి దారుణంగా తయారైందని వారు వాపోతున్నారట. ఇకనైనా కేటీఆర్‌ మార్చుకొని క్యాడర్‌ను అక్కున చేర్చుకుంటే తప్ప పార్టీలో బతికి బట్టకట్టలేమని గులాబీ నేతల సమాచారం. మరోవైపు ఈ పరిస్థితులన్నీ చక్కబెట్టేందుకే చిన్న బాస్‌ పాదయాత్రకు సిద్ధమయ్యారనే చర్చ కూడా జరుగుతోంది. ఇకనైనా అధికారం పోయిందనే ఫ్రస్టేషన్‌ తగ్గించుకుని, ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక రాద్ధాంతం చేద్దామనే ఆలోచన మానుకుని, పార్టీని పట్టించుకోకపోతే అంతే సంగతులు అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఖల్లాస్‌..
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతోంది. ఈ ఆరోపణలు ఎవరో చేయట్లేదు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన కారు పార్టీ ఇప్పట్లో కోలుకోని పరిస్థితి నెలకొంది. అసలే గత ఎంపీ ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా పోవడమేకాక, కనీసం పరువు కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇలాంటప్పుడు పార్టీని గాడిన పెట్టడానికి ప్రయత్నించాల్సిన అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆ ఊసే ఎత్తట్లేదు. పెద్ద సారు ఫామ్‌హౌస్‌లో రెస్ట్‌ తీసుకుంటుంటే, కారు స్టీరింగ్‌ తన చేతిలోకి తీసుకున్న కేటీఆర్‌ ఎంతసేపూ అధికార కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేయడం, క్యాడర్, ప్రజలను రెచ్చగొట్టి ఉసిగొల్పే దగ్గరే ఆగిపోయారు. దీంతో పార్టీ పరిస్థితి ఏమిటో తెలియక గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేటీఆర్‌ ఏదో విధంగా రెండ్రోజులకో రచ్చ చేయడమే పనిగా పెట్టుకుని, పార్టీని గాలికొదిలేయడంతో గులాబీ దళంలో కంగారు మొదలైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో ఇక బీఆర్‌ఎస్‌ మనకొద్దు మహాప్రభో అంటూ జిల్లాలకు, జిల్లాలే లీడర్లు ఖాళీ చేసేసి కాంగ్రెస్‌లోకి జంప్‌ అయిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆయన ఆవేశంతో చేస్తున్న తప్పుల మీద తప్పులు బీఆర్‌ఎస్‌ ఉనికికే ఎసరొస్తోందని కొందరు కీలక నేతలు చెప్పుకోవడం గమనార్హం. ఇందుకు ఉమ్మడి నిజామాబాద్, వరంగల్‌ జిల్లాలో నెలకొన్న పరిస్థితులు చూస్తే అర్థం చేసుకోవచ్చని వారు అంటున్నారు.

నేతల మధ్య ఎడముఖం.. పెడమొఖం
రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కులుగా చేసి ఆన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు వరంగల్, జనగామ జిల్లాలకు అధ్యక్షుడే లేకుండా పోయారు. ఇక గ్రేటర్‌ వరంగల్, హనుమకొండలోనూ అంతంత మాత్రమే. ఇక వరంగల్‌ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ కారు దిగి బీజేపి పార్టీలో చేరడంతో వరంగల్‌ కారు స్టీరింగ్‌ పట్టుకునే వాళ్లు కరవయ్యారనే చర్చ జరుగుతుంది. ఇదే సీన్‌ జనగామ జిల్లాలోనూ ఉంది. పార్టీని ముందుండి నడిపించే జిల్లా అధ్యక్షులు లేక ఆ పార్టీ క్యాడర్‌ నిరాశలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారం పోయిన తరువాత పూర్తిగా ప్రజలకు దూరం అవుతోందనే చర్చ సాగుతోంది. నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం, అనేక మంది ముఖ్య నేతలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో గులాబీ పార్టీ ప్రజలకు దూరం అవుతోంది. ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన నిలవాల్సిన నేతలు ప్రజల్లో లేకుండా పోయారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొనడం తప్ప ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కొందరు నేతలు కనీసం పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొనక పోవడంతో వారంతా పార్టీకి దూరమవుతున్నారా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక ఈ సమయంలో అధ్యక్ష పదవులు తీసుకుంటే కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీని నడపడం ఖర్చుతో కూడుకున్న పనని నేతలు మనసులో మదనపడుతున్నట్టు ద్వితీయశ్రేణి నేతలు చెప్పుకుంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నది సర్వత్రా టాక్‌..

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10