మొత్తం 1,401 పరీక్షా కేంద్రాలు
నిమిషం నిబంధనతో పలుచోట్ల అనుమతి నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్–3 పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బలగాలు 144 సెక్షన్ విధించారు. నిమిషం నిబంధనతో పలుచోట్ల అభ్యర్థులను అనుమతించలేదు.
ములుగు జిల్లాలో 9 కేంద్రాలు..
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 65,361మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రంగారెడ్డిలో 103 పరీక్ష కేంద్రాల్లో 56,394 మంది, హైదరాబాద్‌లో 102 కేంద్రాల్లో 45,918 మంది పరీక్ష రాయనున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 9 కేంద్రాలుండగా.. 2,173 అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,36,395 మంది అభ్యర్థులు గ్రూప్–3 పరీక్షలకు హాజరుకానున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషన్ తెలిపింది. ఆది, సోమవారాల్లో గ్రూప్–3 పరీక్షలు జరగనున్నాయి.
అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు..
అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సంబంధిత అ ధికారుల సమక్షంలో ప్రశ్నపత్రాలను సీసీ కెమెరా ముందు ఓపెన్ చేయాలని చీఫ్ సూపరింటెండెంట్‌లకు టీజీపీఎస్సీ అధికారులు సూచించారు. పరీక్ష హాల్లోకి విద్యార్థి హాల్ టికెట్, పెన్ను, ఏదైనా గుర్తింపు కార్డు తప్ప మరే వస్తువులు పరీక్ష కేంద్రంలోని అనుమతించరాదని ఆదేశించారు. ప్రతి అభ్యర్థికి బయో మెట్రిక్ హాజరు తప్పనిసరిగా తీసుకోవాలని, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచేలా చూడాలన్నారు. పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. ఆలస్యంగా వస్తే అభ్యర్థులను అనుమతించబోమని చెప్పారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.