AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చివరి మ్యాచ్‌లో ‘శత’క్కొట్టేశారు.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం, టీ20 సిరీస్‌ కైవసం

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను సూర్యకుమార్‌ సారథ్యంలోని భారత జట్టు సొంతం చేసుకుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన టీమిండియా.. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో దక్కించుకుంది. ఓ దశలో సిరీస్‌ 1-1తో సమమైనా.. భారత బలంగా పుంజుకుని వరుసగా రెండు మ్యాచుల్లో గెలుపొందింది. శుక్రవారం జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సంజూ శాంసన్, తిలక్‌ వర్మ సెంచరీలతో నిర్ణీత 20 ఓవర్లలో 283/1 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికాను 148కి ఆలౌట్‌ చేసింది. 135 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌కు దిగగా.. ఈ సిరీస్‌లో ఈ మ్యాచ్‌కు ముందే ఒక్కో సెంచరీ కొట్టిన సంజూ శాంసన్, తిలక్ వర్మలు మరోసారి దక్షిణాఫ్రికా బౌలర్లపై దండయాత్ర మొదలెట్టారు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ 51 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇక తిలక్‌ వర్మ సంజూని మించి బ్యాటింగ్ చేశాడు. అతడి కంటే 10 బంతులు ముందుగానే అంటా 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. దీంతో భారత్‌ 283/1 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు 284 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ పెద్దగా రాణించని.. ఆ జట్టు స్టార్ ప్లేయర్లు హెన్రిచ్‌ క్లాసెన్, ఎయిడెన్ మార్‌క్రమ్‌లు మరోసారి నిరాశపర్చారు. దీంతో 10 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి.. ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. కనీసం 50 పరుగులు అయినా చేస్తుందా అనిపించింది. కానీ ట్రిస్టన్ స్టబ్స్‌ (43), డేవిడ్‌ మిల్లర్‌ (36) కాసేపు నిలబడటంతో జట్టు స్కోరు 100 పరుగుల మార్కును దాటింది. చివరకు 18.2 ఓవర్లలో దక్షిణాఫ్రికా 148 పరుగులకు ఆలౌట్ అయింది. దంతో భారత్ 135 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలుపొందిన టీమిండియా.. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. తమను ఎందుకు ఛాంపియన్‌ అంటారో.. మరోసారి నిరూపించుకుంది. 2024లో తన చివరి టీ20 సిరీస్‌ను విజయంతో ముగించింది. ఇక ఈనెల 22 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య 5 మ్యాచ్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10