AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌.. నీ సంగతి తేలుస్తా!.. అధికారంలోకి వచ్చిన వెంటనే పనిపడతా..

సీఎంకు చేతనైతే నాతో ఢీకొనాలి.. అమాయకులతో కాదు..
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌
సంగారెడ్డి జైలులో ఉన్నవారితో కేటీఆర్‌ ములాఖత్‌

తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్‌ రెడ్డి సంగతి తేలుస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. లగచర్ల ఘటనలో అరెస్టై సంగారెడ్డి జైల్లో ఉన్న వారితో శుక్రవారం ములాఖత్‌ అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడారు. నిన్న కొడంగల్‌ తిరగబడ్డది.. రేపు తెలంగాణ తిరగబడుతుందని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భయపడవద్దని ధైర్యం చెప్పారు.

రాజ్యాంగేతర శక్తిగా తిరుపతిరెడ్డి
సీఎం రేవంత్‌ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. తిరుపతిరెడ్డి ఫోన్‌లో ఆదేశాలిస్తుంటేం అధికారులు పాటిస్తున్నారన్నారు.

తెలంగాణకు రాబందులా మారారు..
కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్‌ రెడ్డి రాబందులా మారారని మండిపడ్డారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్‌ రెడ్డి, ఇప్పుడు ఫార్మా కంపెనీలు కావాలని చెప్పడమే కాకుండా వేలాది ఎకరాలు కావాలంటున్నారని మండిపడ్డారు. ఇవాళ లగచర్లలో దుర్మార్గమైన పరిస్థితి నెలకొని ఉంది. కులగణనలో పాల్గొని వచ్చిన పంచాయతీ సెక్రటరీని కూడా అరెస్టు చేసి జైల్లో వేశారు. ఆ సంఘటనలో పాల్గొనలేదు.. అయినా తనను జైల్లో వేశారని ఆ యువకుడు చెబుతున్నాడు. ఇంకో యువకుడు వనపర్తిలో చదవుకుంటున్నాడు. ఈ ఘటన గురించి తెలుసుకుని మా ఇంటి వాళ్లు ఎలా ఉన్నారో అని వస్తే నన్ను కూడా తీసుకెళ్లారని చెప్పారు. 70 మందిని అరెస్టు చేసి రెండు డీసీఎంలలో తీసుకెళ్లారని చెప్పారని కేటీఆర్‌ తెలిపారు.

విద్యార్థిని సైతం అరెస్ట్‌ చేశారు..
– ఓ ఐటీఐ విద్యార్థిని అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. కలెక్టర్‌ లగచర్లకు వచ్చినప్పుడు ఆందోళనలో పాల్గొన్నవారిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా ఉన్నారని తెలిపారు. లగచర్ల ఘటనలో కాంగ్రెస్‌ కార్యకర్తలను వదిలేశారన్నారు. కేవలం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను మాత్రమే అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ ఘటనకు సీఎం కావాలనే రాజకీయ రంగు పులిమారన్నారు.

సీఎంకు చేతనైతే నాతో కొట్లాడాలి..
తన పదవి ఐదేళ్లే ఉంటుందని రేవంత్‌ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు. కొడంగల్‌ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలని సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎకరం రూ.60 లక్షల భూమిని రూ.10 లక్షలకే లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పేదవాడి కన్నీళ్ల ఉసురు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రేవంత్‌ రెడ్డికి చేతనైతే తమతో కొట్లాడాలి తప్ప అమాయకులతో కాదన్నారు.
ఆడబిడ్డలు రోదిస్తున్నారు..
ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా రైతులు 9 నెలలగా పోరాటం చేస్తున్నారు. లగచర్ల, హకీంపేటతో పాటు మరో రెండు తండాల ఆడబిడ్డలు రోదిస్తున్నారు. ఫార్మా కంపెనీలు కాలుష్యమని ఆయన ప్రచారం చేశారు. అదే ఫార్మాను కొడంగల్‌ కు తెస్తా అంటూ 3 వేల ఎకరాలు రావాలని పేదల భూములు గంజుకుంటున్నారు. దీంతో స్థానిక రైతులు మర్లబడ్డారు. 9 నెలలుగా పోరాటం చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. అధికారుల ముందు నిరసన తెలిపితే దాడుల పేరిట అరెస్టులు చేసి జైల్లో వేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.

ANN TOP 10