AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

20 లక్షల ఇళ్లు కట్టిస్తాం.. కీలక విషయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి

తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Pongulati) గుడ్ న్యూస్ చెప్పారు.. రాష్ట్రంలో పేద వర్గాల కోసం తర్వలోనే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాభవన్(Prajabhavan) లో మంత్రితో ముఖాముఖి సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న పొంగులేటి.. అనంతరం తన వద్దకు వచ్చిన సమస్యల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ప్రజలు ఇళ్ల సమస్యల్ని తీసుకువచ్చారని, గత ప్రభుత్వాలు మాదిరి తాము మాటిచ్చి, తప్పించుకోమని ప్రకటించారు. దాంతో పాటే అనేక ఇతర విషయాల్ని తెలిపారు.

రాష్ట్రంలోని పేద ప్రజలకు ఎలాంటి రికమండేషన్లు అవసరం లేదన్న మంత్రి పొంగులేటి.. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లను(Indhiramma Houses) అందిస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని.. గ్రామాల్లో సభలు నిర్వహించి, అందులో నిజమైన లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు గుర్తు చేసిన మంత్రి పొంగులేటి.. వచ్చే నాలుగేళ్లల్లో మొత్తంగా 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. తొలి ప్రాధాన్యంగా.. ఇళ్ల స్థలం ఉన్న లబ్ధిదారులకు డబ్బులు అందిస్తామన్న మంత్రి పొంగులేటి, తర్వాత ఇళ్లు లేని వారికి ప్రభుత్వమే స్థలంతో పాటుగా ఇళ్లను అందిస్తుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు కచ్చితంగా 400 చ.అ స్థలంలో ఇల్లు నిర్మించాలని, అందులో తప్పనిసరిగా వంటగది, బాత్రూమ్ ఉండాలని చెప్పారు. అలాగే.. ప్రజల అవసరాల మేరకు, 4 విడుతల్లో రూ. 5 లక్షలు అందించనున్నట్లు ప్రకటించారు. మొదటి విడుతగా పునాది స్థాయి పూర్తయిన ఇళ్లకు రూ.1 లక్ష, దర్వాజ స్థాయికి వచ్చాక మరోక రూ.1.25 లక్షలు అందిస్తామన్నారు. ఇల్లు స్లాబ్ స్థాయికి వచ్చాక రూ.1.75 లక్షలు, గృహప్రవేశం సమయంలో మిగిలిన రూ.1 లక్ష రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో అడబిడ్డల పేరుతోనే ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంతా బాగోలేదని తెలిపిన మంత్రి పొంగులేటి.. అయినా ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లను నిర్మించి ఇస్తామని ప్రకటించారు.

ANN TOP 10