AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవును.. సురేశ్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడే.. పట్నం నరేందర్‌రెడ్డి స్పష్టీకరణ

వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి స్పందించారు. సురేశ్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడేనని వెల్లడించారు. ఆయనకు చెందిన ఏడెకరాల పొలం ఫార్మా కంపెనీతో పోతోందన్న ఆవేదనతో అందరితో కలిసి పబ్లిక్‌ హియరింగ్‌ను బహిష్కరించాడని చెప్పారు. పబ్లిక్‌ హియరింగ్‌ను బాయికాట్‌ చేసిన వారిలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలే కాకుండా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు సైతం ఉన్నారని తెలిపారు. కేవలం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సురేశ్‌ తమతో రోజూ వివిధ పనుల గురించి మాట్లాడుతనే ఉంటాడని, భూ సేకరణను గ్రామంలో బహిష్కరిస్తున్నామని కూడా తనకు చెప్పాడని, బహిష్కరించాలని తాను కూడా చెప్పానని, అది కూడా శాంతియుతంగా బహిష్కరించాలని సూచించానని తెలిపారు. వారు బహిష్కరించిన తర్వాత కలెక్టర్‌ గ్రామానికి వెళ్లారని, అందుకే గొడవ జరిగిందని పేర్కొన్నారు.

భూములు ఇవ్వబోమని చెబుతూనే ఉన్నారు..
ఫార్మా సిటీకి భూములు ఇవ్వలేమని ఆరు నెలలుగా రైతులు సీఎంకు చెప్తూనే ఉన్నారని నరేందర్‌ రెడ్డి చెప్పారు. కలెక్టర్‌పై జరిగిన దాడి సీఎం నిర్ణయాలే కారణమని పేర్కొన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు సీఎం సోదరుల కోసమా..? బామ్మర్ది కోసమా..? అని నిలదీశారు. ఫార్మా కంపెనీ భూ బాధితులు అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం కానీ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని అంటున్నారని చెప్పారు. కలెక్టర్‌పై దాడిని ఖండిస్తున్నామని, దాడులు చేసిన వారిని తప్పకుండా అరెస్టు చేయాలని, రైతులను కాదని అన్నారు.

దాడిలో సురేశ్‌ కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు రెచ్చగొట్టడం వల్లే గ్రామస్తులు ఈ దాడులకు పాల్పడినట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డితోనూ ఆయనకు ఉన్న సంబంధాలను బయటపెట్టారు. దాడి సమయంలోనూ సురేశ్‌ నరేందర్‌ రెడ్డికి ఫోన్లు చేయడాన్ని కనిపెట్టారు. దీంతో సురేశ్‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా.. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10