తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అందులోభాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను ఏఐసీసీ ముఖ్య నేతలకు సీఎం రేవంత్ వివరించనున్నట్లు సమాచారం.
మరోవైపు సీఎం రేవంత్ మళ్లీ హస్తినకు పయనం కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీ టూర్.. రాష్ట్ర పార్టీ నేతల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరుపున బరిలో దిగేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఆయా ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.