తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణాను అప్పుల పాలుచేసిన బీఆర్ఎస్ పార్టీ.. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేసేందుకు ప్రయత్నిస్తోందని పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమాన్ని కక్షపూరితంగా విస్మరిస్తున్నారన్న సీతక్క.. మహారాష్ట్రలో బీజేపీకి .. బీఆర్ఎస్ బీ-టీమ్ గా పనిచేస్తుందని అన్నారు.
రాష్ట్రాన్ని రెండుసార్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఎన్నో తప్పుడు పాల్పడిందని, వాటికి సంబంధించిన కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీ తో అంటకాగుతోందని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి పక్కా ప్రణాళికతో బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తుందని, పదేపదే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల ఉచిత ప్రయాణ పథకంపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ.. ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అత్యవసర సమయాల్లో చేతిలో రూపాయి లేకున్నా మహిళలు ఉచిత ప్రయాణాలు చేయగలుగుతున్నారని వివరించారు. ప్రజా సంక్షేమాన్ని జీర్ణించుకోలేక ఆటో డ్రైవర్లను ఉసిగొల్పుతున్నారన్న మంత్రి సీతక్క.. ఓలా, ఉబర్ క్యాబ్లు, బైక్లు తెచ్చినప్పుడు ఆటో డ్రైవర్లు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.