AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇక వారందరికీ నోటీసులు! .. బిగుస్తున్న ‘ఫోన్‌’ ఉచ్చు.. మొదటగా చిరుమర్తి లింగయ్యకు..

ట్యాపింగ్‌ కేసులో మరో సంచలన పరిణామం
జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు రావాలంటూ పిలుపు

(మహా, హైదరాబాద్‌):
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటి వరకు అధికారులే జైలుకు వెళ్లగా.. ఇప్పుడు నేతల వంతు వచ్చింది. తాజాగా నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఈ కేసులో సమన్లు జారీ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని పోలీస్‌ స్టేషన్‌కు రావాలంటూ నోటీసులు ఇచ్చారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ అవడంతో రాజకీయవర్గాల్లో సంచలనం రేకెత్తుతోంది. మొదటిసారిగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ కావడంతో.. ఉత్కంఠ నెలకొంది. నెక్ట్స్‌ నోటీసులు అందుకునేది ఎవరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

చిరుమర్తి ప్రమేయం..
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రమేయం ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. తన ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్‌ చేసి నిఘా ఉంచినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే.. ఆయనకు నోటీసులు జారీ చేశారు.

రాజకీయ ప్రకంపనలు..
ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్‌ అవగా.. రాజకీయ నాయకులు కూడా అరెస్ట్‌ అవుతారంటూ కాంగ్రెస్‌ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో.. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి నోటీసులు జారీ చేయడంపై మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటి వరకు అధికారులు.. ఇక నుంచి రాజకీయ నేతల వరుస వచ్చిందనే టాక్‌ నడుస్తోంది. మరి నెక్ట్స్‌ ఎవరికి నోటీసులు జారీ చేస్తారు? ఎవరెవరికి ఈ కేసులో ప్రమేయం ఉందోననే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. ముఖ్యంగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ అన్నట్లు పొలిటికల్‌ బాంబులు ఈ కేసులోనే పేలనున్నాయా? మరేదైనా కేసులు ఉన్నాయా? అనే చర్చ నడుస్తోంది.

ఇప్పటి వరకు అధికారులే అరెస్ట్‌..
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా ఏ1 ప్రభాకర రావు, రిటైర్డ్‌ ఐపీఎస్, ప్రణీత్‌ రావు డీఎస్పీ, ఏ3 రాధాకిషన్‌ రావు, రిటైర్డ్‌ అదనపు ఎస్పీ, ఏ4 భుజంగ రావు, అదనపు ఎస్పీ, ఏ5 తిరుపతన్న, అదనపు ఎస్పీ, రిటైర్డ్‌ అదనపు ఎస్పీ వేణుగోపాల్‌ రావు, గట్టుమల్లు భూపతి అరెస్ట్‌ అయ్యారు. ప్రభాకర రావు ఒక్కరే విదేశాల్లో ఉన్నారు. వీరంతా కలిసి ప్రతిపక్ష నాయకులు, అధికార పక్ష నాయకులు, సినిమా, వ్యాపార ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్‌ రావు అరెస్ట్‌తో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేక బృందంతో విచారణ జరిపించింది. ఈ కేసును విచారించే కొద్ది కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని నిర్ధారించారు పోలీసులు. రేపో మాపో పొలిటికల్‌ లీడర్స్‌కి కూడా నోటీసులు అందజేస్తారనే ప్రచారం జరిగింది. దానికి కొనసాగింపుగానే.. సోమవారం మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేశారు పోలీసులు.

ANN TOP 10