AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ ముగ్గురు పిల్లలను నా పిల్లల మాదిరే చదివిస్తా: కేటీఆర్

సిరిసిల్లలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేతన్న బైరి అమర్‌ దంపతుల కుటుంబసభ్యులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. ఆదివారం సాయంత్రం సిరిసిల్లకు చేరుకున్న కేటీఆర్‌.. వెంకంపేటలోని భైరి అమర్‌- స్రవంతి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున డిపాజిట్‌ చేయిస్తానని తెలిపారు. ధైర్యంగా ఉండాలని.. బాగా చదువుకోవాలని ఈ సందర్భంగా భైరి అమర్‌ పిల్లలకు కేటీఆర్‌ సూచించారు.

అమర్‌ పిల్లలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్‌లో తెలిపారు. బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు పరిహారాన్ని అందించవలసిందిగా కోరారు. అనంతరం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్లలో ఇప్పటివరకు 20 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటు వల్ల మాత్రమే నేతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

సిరిసిల్ల నుంచి తాను ఎమ్మెల్యేగా ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే తక్షణమే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్‌ తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టే విధంగా కక్ష పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మానవత్వంతో స్పందించాలని కోరారు. సిరిసిల్లకు న్యాయం చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా సిరిసిల్లలో ఒక కుటుంబాన్ని లేదా కొన్ని కుటుంబాలను మాత్రమే నేను ఆదుకోగలుగుతానని అన్ని కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10