AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రియురాలి తండ్రిపై ప్రేమికుడి కాల్పులు.. సరూర్‌నగర్‌లో యువకుడి దారుణం

కుమార్తె ప్రేమ వ్యవహారం గురించి తెలుసుకున్న తండ్రి ఆమెను మందలించి దూరంగా పంపించేశాడు. దీంతో కోపం పెంచుకున్న ఆమె ప్రియుడు.. ఇంటికి వచ్చి తండ్రిపై కాల్పులు జరిపాడు. హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేటకు చెందిన బల్వీందర్‌ సింగ్‌ (25), సరూర్‌ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ యువతి (23) కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఈ విషయం యువతి ఇంట్లో తెలిసింది. దీంతో తండ్రి ఆమెను ఇటీవలే అమెరికాకు పంపించారు.

ఆదివారం (నవంబర్ 10) మధ్యాహ్నం యువతి ఇంటికి వచ్చిన బల్వీందర్‌ సింగ్‌.. ఆమె తండ్రి రేవంత్‌ ఆనంద్‌తో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన బల్వీందర్.. తన వెంట తెచ్చుకున్న ఎయిర్‌ గన్‌తో రేవంత్‌‌పై కాల్పులు జరిపాడు. ఒక తూటా ఆయన కంట్లో నుంచి దూసుకెళ్లింది. కన్నుకు తీవ్ర గాయమైంది. కుటుంబసభ్యులు ఆయణ్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు బల్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన యువతి తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ANN TOP 10