తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (శుక్రవారం) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులతో పాటు సినీ రంగానికి చెందినవారు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సీఎం రేవంత్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు.
‘‘సీఎం రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్దిస్తున్నాను’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
చంద్రబాబు ట్వీట్
మరోవైపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా రేవంత్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మరోవైపు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యం, దీర్ఘాయువుతో తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చే శక్తి పొందాలని అభిలాషిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అన్నకు బర్త్‌డే విషెస్: వైఎస్ షర్మిల..
సీఎం రేవంత్ రెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ప్రియమైన రేవంత్ అన్నా.. మీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆదర్శప్రాయమైన మీ నాయకత్వం, అంకితభావం, తెలంగాణ ప్రజల ప్రగతి, సంక్షేమం పట్ల అవిశ్రాంతంగా పనిచేస్తున్న మీ నిబద్ధత మా అందరికీ స్ఫూర్తినిస్తాయి. ఈ ఏడాదంతా మీ విజయాలు కొనసాగాలి. ఆరోగ్యాన్ని, తెలంగాణను మరిన్ని విజయాల దిశగా నడిపించే శక్తిని మీకు అందాలని కోరుకుంటున్నాను’’ అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
మెగాస్టార్ విషెస్ ఇదే..
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ప్రజాసేవలో ఆరోగ్యంగా ఉండాలని అభిలాషిస్తున్నట్టు చెప్పారు. ‘వచ్చే ఏడాది అద్భుతంగా మీకు ఉండాలి’ అని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి విషెస్..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో పొందాలని కోరుకుంటున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.