AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డ్‌?.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

పోలీసుల ఆరా
కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు గురించి కీలక విషయం తెలిసింది. ఆయనకు అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్‌కార్డు మంజూరైనట్లు సమాచారం. అక్కడ స్థిరపడిన ప్రభాకర్‌రావు కుటుంబ సభ్యుల స్పాన్సర్‌షిప్‌తో ఆయనకు గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ అంశంపై ఆరా తీస్తున్నారు.

గ్రీన్‌కార్డు వస్తే పెద్ద చిక్కే..
ఒకవేళ ప్రభాకర్‌రావుకు గ్రీన్‌ కార్డు మంజూరైతే.. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ గ్రీన్‌ కార్డు అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. గ్రీన్‌ కార్డు వస్తే ప్రభాకర్‌రావు ఎంత కాలమైనా అమెరికాలో ఉండే వెసులుబాటు ఉంటుంది. అదే జరిగితే ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలు లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటికే ఆయన పాస్‌పోర్టు రద్దు కావడంతో.. అమెరికాలోని భారత ఎంబసీ ద్వారా అక్కడి అధికారులకు చేరవేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది.

నోటీసులు పంపినా..
తెలంగాణలో ప్రకంపనలురేపిన ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ వ్యవహారం బయటపడిన తర్వాత ప్రభాకర్‌ అమెరికా వెళ్లిపోయారు. ఈ ఏడాది మార్చి 10న ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ రమేష్‌ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మార్చి 11న అమెరికా వెళ్లిన ప్రభాకర్‌రావు అక్కడే ఉన్నారు. ఫో¯Œ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. నలుగురు పోలీసు అధికారుల్ని అరెస్ట్‌ చేయడంతో సంచలనంరేపింది. ఆ తర్వాత ప్రభాకర్‌రావును ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చిన తర్వాత కోర్టు ఛార్జ్‌షీట్‌ నమోదు చేశారు. అప్పటి నుంచి ప్రభాకర్‌ను అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు చేశారు పోలీసులు.. ఆయనకు మెయిల్‌ ద్వారా నోటీసులు కూడా పంపారు.

ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు
ప్రభాకర్‌రావు ఈ నోటీసులపై స్పందించారు.. తాను వైద్యచికిత్స నిమిత్తం అమెరికా వెళ్లానని చెప్పారు. తాను ఇల్లినాయిస్‌ అరోరాలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన వీసా గడువు జూన్‌ తో ముగుస్తుందని.. ఈ క్రమంలో వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్‌ వస్తానని చెప్పారు. అయితే గడువు దాటినా ప్రభాకర్‌ రావు అక్కడే ఉన్నారు. ఆయన మార్చిలో మూడు నెలల కాలపరిమితితో ఉన్న వీసాతో అమెరికా వెళ్లారు.. ఈ గడువును మరో ఆరునెలలకు పొడిగించుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆ వెంటనే ప్రభాకర్‌రావుపై లుక్‌అవుట్‌ నోటీసు జారీ చేశారు. ఈ కేసులో పోలీసులు ఇంటర్‌పోల్‌ ద్వారా రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయించే ప్రయత్నం చేశారు. ప్రభాకర్‌రావు పాస్‌పోర్టును సైతం రద్దు చేశారు.. ఆ విషయాన్ని విదేశాంగ శాఖ ద్వారా అమెరికా పోలీసులకు చేరవేసే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఆయనకు గ్రీన్‌ కార్డు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.

ANN TOP 10