మా వాడు బీర్ ఎత్తితే దించకుండా తాగుతాడు తెలుసా..? అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఎత్తితే దించకుండా తాగడం కాదు ముందు అందులో ఏముందో చూసుకుని తాగాలి. అదేంటి బీర్ లో ఏముంటుంది చూసుకుని తాగడానికి అనుకుంటున్నారా? ఉంటాయ్.. బీరులో వానపాములు, గడ్డి, కప్పలు ఇలా చాలా ఉంటాయి. ఇటీవల వస్తున్న వార్తలే అందుకు నిదర్శనం. ఇటీవలే బీరు బాటిళ్లో వానపాము కనిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం బీరు బాటిల్ లో గుట్కా ప్యాకెట్ వచ్చింది. ఇక తాజాగా బీరు బాటిల్ లోనే కప్ప కలేబరాలు వచ్చాయి. వివరాల్లోకి వెళితే… ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని డొంకేశ్వర్ మండల కేంద్రంలోని వైన్ షాపులో ఓ మద్యం ప్రియుడు హాయిగా కూర్చుని ఓ బీర్ తాగేందుకు సిద్దం అయ్యాడు. తీసుకున్న తరవాత కాస్త స్టఫ్ తీసుకుని కూర్చుని బీర్ ఓపెన్ చేశాడు. అంతే అందులో కప్ప కళేబరాలు కనిపించడంతో ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. దీనిపై వైన్ షాపు యజమానిని నిలదీయడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు.