AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజ్‌భవన్‌లో సీఎం రేవంత్.. కుల గణన, ఇతర పథకాలపై చర్చ!

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిభేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. కాగా, గతకొన్ని రోజులుగా జ్వరంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విషయం తెలుసుకున్న సీఎం, మంత్రులతో కలిసి వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, గుత్తా అమిత్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్‌, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, రాజ్‌ భవన్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు ఉన్నారు.

కులగణనపై బ్రీఫింగ్
గవర్నర్‌తో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈక్రమంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కులగణన సర్వే తీరును గవర్నర్‌కు సీఎం వివరించారు. దేశానికి రోల్ మోడల్‌గా నిలిచేలా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. 2025లో చేపట్టే దేశవ్యాప్త జనగణలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను సీఎం కోరారు.

మిషన్ మూసీపై..
అనంతరం మూసీ ప్రక్షాళన జరుగుతున్న తీరునూ సీఎం గవర్నర్‌కు వివరించారు. ఈ క్రమంలో గవర్నర్ జోక్యం చేసుకుంటూ, పేదలు నష్టపోకుండా తగిన పరిహారం అందించాలని సీఎంకు సూచించారు. కాగా, దీనిపై సీఎం స్పందిస్తూ, నిర్వాసితులకు ఇప్పటికే డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చామని, వారి పిల్లలకు మెరుగైన విద్యకు ఏర్పాట్లు చేయటంతో బాటు కొంత ఆర్థిక సాయమూ అందించామని వివరించారు. ఏ ఒక్కరినీ బలవంత పెట్టటం జరగలేదని, ప్రభుత్వం చిత్తశుద్ధికి గమనించిన నిర్వాసితులు స్వచ్ఛందంగా అక్కడినుంచి తమకు కేటాయించిన ఇండ్లకు తరలి వెళ్లారని తెలిపారు. మరోవైపు మరికొద్ది రోజుల్లో జరగనున్న తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌ను ఆహ్వానించారు.

ANN TOP 10