AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికా ఎన్నికల ఫలితాల వేళ డొనాల్డ్ ట్రంప్ గెలుపు ప్రసంగం.. కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తనకు అనుకూలంగా రావడంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులను ఉద్దేశించి.. ఆయన గెలుపు ప్రసంగం చేశారు. అమెరికా చరిత్రలో ఎప్పుడూ చూడని విజయాన్ని ఇప్పుడు మనం దక్కించుకున్నామని రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులతో ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాను మళ్లీ గొప్పదేశంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. అమెరికా ఫస్ట్ అనేది తన నినాదం అని డొనాల్డ్ ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ 315 స్థానాలు గెలుచుకుంటుందని ట్రంప్ తెలిపారు.

ఈ సభకు డొనాల్డ్ ట్రంప్, సతీమణి మెలానియా ట్రంప్, చిన్న కుమారుడు బారన్ ట్రంప్‌తో కలిసి వచ్చారు. అమెరికా చరిత్రలోనే ఇది మరుపురాని విజయం అని తెలిపిన ట్రంప్.. ఈ మార్పు అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని తేల్చి చెప్పారు. అమెరికన్లకు సువర్ణ యుగం రాబోతుందని పేర్కొన్న ట్రంప్.. ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు గొప్ప పోరాటం చేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు చేపట్టిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమమని తెలిపారు. ఈ గొప్ప విజయం దక్కిన సందర్భంగా దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

ఇక నుంచి అమెరికా ప్రజలు, కుటుంబాల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. రిపబ్లికన్లను విమర్శించే వారి విమర్శలు తప్పని నిరూపించారని పేర్కొన్నారు. అడ్డంకులను అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్లు వివరించారు. ఈ విజయం కోసం కష్టపడిన వారికి తగిన ప్రతిఫలం ఉంటుందని చెప్పారు. ఇక ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపి, అమెరికాను గ్రేటెస్ట్‌గా మార్చడానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తానని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో సరిహద్దుల సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. చట్టబద్ధంగా ఇతర దేశాల వారు అమెరికాలోకి రావాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన భార్య మెలానియాకు కృతజ్ఞతలు చెప్పిన ట్రంప్.. ఆమె రాసిన పుస్తకం ప్రజాదరణ పొందిందని తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10