అగ్రరాజ్యం అమెరికాకు 47 వ అధ్యక్షుడిగా రెండవ సారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్ చేశారు. ‘‘చారిత్రాత్మక ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్న నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ నకు హృదయపూర్వక అభినందనలు.
మీ మునుపటి పదవీకాలం విజయాలను మీరు నిర్మించేటప్పుడు, భారత్-యూఎస్ సమగ్ర గ్లోబల్, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురు చూస్తున్నాను’’ అంటూ మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈనాటి ఈ స్నేహం ఏనాటిదో..
ముందు నుంచి కూడా డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ నకు ఓటు వేయాలని ఆ సమయంలో మోదీ బహిరంగంగానే ప్రకటించారు. వారిద్దరి మధ్య బలమైన దౌత్య సంబంధాలు, వ్యూహాత్మక సహకారం, గాఢమైన వ్యక్తిగత స్నేహం కొనసాగుతున్నాయి.