రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చోటు చేసుకుంటూ వస్తోన్న పరిణామాలు అనూహ్య మలుపులు తిరిగేలా కనిపిస్తోన్నాయి.
ప్రత్యేకించి- శాంతిభద్రతల వ్యవహారం అటు జాతీయస్థాయిలోనూ చర్చనీయాంశమౌతోంది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. నంద్యాల, తిరుపతి, శ్రీకాకుళం, కడప, కాకినాడ.. వంటి పలు జిల్లాల్లో హత్యాచార ఉదంతాలు జరిగాయి.
ఈ పరిణామాలపై చంద్రబాబు కూటమి కీలక భాగస్వామ్య పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలం అయ్యామనే అభిప్రాయం ప్రజల్లో నెలకొని ఉందని, తాను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయనీ వ్యాఖ్యానించారు. అత్యాచార నిందితులను పోలీసుల సకాలంలో అరెస్ట్ చేయకపోవడాన్నీ ఆయన తప్పుపట్టారు. అయిదేళ్లలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదని, శాంతి భద్రతల పరిరక్షణ అనే అలవాటు అధికారులకు తప్పిందని పేర్కొన్నారు.
యూపీలో యోగి ఆదిత్యనాథ్ చేసినట్లు క్రిమినల్స్‌కు చేయాలని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర డీజీపీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు హోంమంత్రి వంగలపూడి అనితను అవమానపరిచేలా ఉన్నాయని మందకృష్ణ మాదిగ అన్నారు.
ఈ పరిణామాల అనంతరం టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తోన్నాయి. టీడీపీ- జనసేన కార్యకర్తలు, సానుభూతిపరుల మధ్య సోషల్ మీడియాలో వేదికగా ఓ మినీ యుద్ధమే సాగుతోంది. రెండు పార్టీల అభిమానులు పరస్పరం ఆరోపణలను సంధించుకుంటోన్నారు. ఈ పరిస్థితుల మధ్య పవన్ కల్యాణ్.. హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. బుధవారం ఆయన ఢిల్లీ వెళ్తారు. సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
ఈ మేరకు అపాయింట్‌మెంట్ కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత, పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై అమిత్ షా ఆరా తీశారని, పూర్తిస్థాయి నివేదిక కోరారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో భేటీ కాబోతోన్నారు. మంత్రుల శాఖల్లో మార్పులు ఉండొచ్చనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతోన్నాయి.