టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సు టికెట్ ధరలను పెంచిందన్న ప్రచారంలో వాస్తవం లేదని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. రెగ్యులర్ సర్వీసులకు సాధారణ ఛార్జీలే అమల్లో ఉన్నాయని పేర్కోన్నారు. అయితే, దీపావళి తిరుగు ప్రయాణ రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ జీవో మేరకు సంస్థ ఛార్జీలను సవరించిందని తెలిపారు.
ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక సర్వీసులను నడుపుతోందన్నారు.
అయితే తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో ఆ ప్రత్యేక బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులకు అనుగుణంగా టిక్కెట్ ధరను సవరించుకోనేందుకు 2003లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16ను జారీ చేసిందని వెల్లడించారు.
పండుగలు, ప్రత్యేక సందర్భాలలో నడిచే ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 1.50 వరకు టిక్కెట్ ధరలను సవరించే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు కల్పించిందని తెలిపారు. ఇది గత 21 ఏళ్లుగా కొనసాగుతున్న అనవాయితీ అని స్పష్టం చేశారు.