కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన సర్వే ప్రారంభం కానున్న తరుణంలో సర్వం సిద్దం చేశారు. ఈ క్రమంలోనే బీసీ జనాభా గణాంకాల సేకరణకు ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఉత్తర్వుల విడుదల చేసింది. బీసీ కులగణనకు డేడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వర్ రావును నియమించారు. నెలరోజుల్లో కమిటీ రిపోర్టు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను శాస్త్రీయమైన పద్ధతిలో తేల్చాలని హైకోర్టు సూచించింది. దీని కోసం 2 వారాల్లో డెడికేటెడ్ కమిషన్ను నియమించాలని అక్టోబర్ 30న ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వారం రోజుల్లోనే ఈ కమిషన్ ను నియమించింది.
డిసెంబర్ 9లోగా బీసీ కులగణన పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. బీసీ వర్గాల్లోని కులాలు, వాటి ఉపకులాల లెక్క తేల్చబోతున్నారు. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల వివరాలను సైతం సేకరించనున్నారు. మొత్తం 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి కానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కులగణనకు అవసరమైన ప్రొఫార్మాను బీసీ కమిషన్ ఇప్పటికే తయారు చేసింది. దాదాపు 54 నుంచి 64 ప్రశ్నలతో ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు సమాచారం.