AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కమలా హారిస్‌ వికాసమా?.. ట్రంప్‌కే పట్టమా?.. అమెరికాలో నేడే పోలింగ్‌

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక పోరు తుది అంకానికి చేరుకుంది. నవంబర్‌ 5న జరిగే ఈ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ పార్టీ తరఫున దేశ ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ బరిలో నిలిచారు. అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఇద్దరు మధ్యా నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. శుక్రవారం ఇరువురు నేతలు విస్కాన్సిన్‌లో తుది ప్రచారం నిర్వహించడం విశేషం. ఈ ఇద్దరిలో ఎవరు విజేతగా నిలుస్తారో అని అటు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

ఇప్పటికే 4.1 కోట్ల మంది అమెరికన్లు బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా చరిత్రలో ఇప్పుడు జరుగుతున్నంత ఉత్కంఠ భరిత పోటీ గతంలో ఎన్నడూ జరగలేదని చరిత్రకారులు పేర్కొంటున్నారు. మంగళవారం 5వ తేదీన పోలింగ్‌ జరిగినప్పటికీ అధ్యక్షునిగా ఎన్నికైన వారు 2025 జనవరి 20 తర్వాతే బాధ్యతలు చేపడతారు. సాధారణంగా ఎన్నికైన సాయంత్రమో, మరునాడో మీడియా సంస్థలు తమకు ఉన్న డాటా ఆధారంగా విజేత ఎవరో ప్రకటించేస్తాయి. అసోసియేటెడ్‌ ప్రెస్‌ లాంటి పెద్ద మీడియా సంస్థలు ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే తాము ఏర్పాటు చేసిన ‘కాల్‌’ ఔట్‌లెట్ల ద్వారా రాష్ర్టాల్లోని విజేతలను ప్రకటించడం ప్రారంభిస్తాయి. 270 అంతకన్నా ఎక్కువ ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు.

ఆ ఏడు రాష్ర్టాల్లో ఆధిక్యం వస్తేనే..

అధ్యక్ష అభ్యర్థుల తలరాతను ముఖ్యంగా అమెరికాలోని ఏడు రాష్ర్టాలు నిర్ణయిస్తాయి. జార్జియా, మిషిగన్‌ సహా ఏడు రాష్ర్టాల్లో ఆధిక్యం పొందిన వారే అధ్యక్షుడవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. పెన్సిల్వేనియాలోని 19 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లు అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా నిలిచాయని గత అధ్యక్ష ఎన్నికలు రుజువుచేసినట్టు టెలిగ్రాఫ్‌ తన కథనంలో పేర్కొంది. 2024 ఎన్నికల్లోనూ ఈ రాష్ట్రం ఓట్లు కీలకంగా ఉన్నాయని తెలిపింది. కాగా, 2020 ఎన్నికల్లో జో బైడెన్‌కు స్వల్ప ఆధిక్యం ఇచ్చి ట్రంప్‌కు త్రుటిలో అధికారాన్ని చేజార్చిన ఆరిజోనా, జార్జియా, విస్కోన్సిన్‌, నెవాడా ఫలితాలపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఒపీనియన్‌ పోల్స్‌ గురించి పరిశీలిస్తే కమలా హారిస్‌కు నెవాడా, నార్త్‌ కరోలినాల్లో స్వల్ప ఆధిక్యం ఉండగా, ఆరిజోనాలో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. మిషిగన్‌, జార్జియా, పెన్సిల్వేనియాలో ఇద్దరి మధ్య పోటాపోటీ నడుస్తున్నది. ఈ ఏడు రాష్ర్టాల్లో ఎవరికి ఆధిక్యం వచ్చినా 3.5 శాతం తేడాయే ఉంటుందని అంచనా.

తటస్థ ఓటర్లే కీలకం

ప్రముఖ శాంపిల్‌ సర్వే గాలప్‌ పోల్‌ డాటా ప్రకారం 2024 ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిలో 27 శాతం, డెమొక్రట్లకు, 27 శాతం రిపబ్లికన్లకు మద్దతు ఇస్తున్నట్టు చెప్పగా, 43 శాతం స్వతంత్ర ఓటర్లుగా ప్రకటించుకున్నారు. అంటే వీరు ఏ పార్టీకి మద్దతు ఇచ్చేది ప్రకటించరు. గత ఎన్నికల్లో వీరు 30 శాతం ఉన్నారు. దీంతో వీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో వారే విజేతగా నిలుస్తారని అంచనా.

రోజుల తరబడి..

సాధారణంగా అమెరికా ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా విజేత ఎవరనేది రోజుల తరబడి అంచనా వేయలేరు. 2020 నవంబర్‌ 3న ఎన్నికలు జరిగిన నాలుగు రోజులకు జోబైడెన్‌ ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించారు. నవంబర్‌ 5నే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా తుది ఫలితాలకు రోజులు పట్టవచ్చు. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 6నుంచి రాత్రి 8 గంటల (భారత కాలమానం ప్రకారం 5వ తేదీ సాయంత్రం 4.30 నుంచి మరునాడు ఉదయం 6.30) వరకు పోలింగ్‌ జరుగుతుంది.

ANN TOP 10