AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేను హోంమంత్రిని అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయి.. పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత వహించాలని అన్నారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌.. కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ హైస్కూలులో సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. తమపై విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే హోం మంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని ఎందుకు వదిలేస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మహిళలపై అత్యాచారం చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టే ఆ పరిణామాలు ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. గత ఐదేళ్లలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి ముఖ్యమంత్రి మాట్లాడలేదని అన్నారు. అప్పులెలా వారసత్వంగా వచ్చాయో.. గత ప్రభుత్వాల తప్పిదాలు అలానే వచ్చాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చేసిన నేరాలు కూడా ఇప్పుడు వారసత్వంగా వచ్చాయని చెప్పారు.

గత ప్రభుత్వం అలసత్వం కూడా ఇప్పుడు వారసత్వంగా వచ్చిందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను బలంగా అమలు చేయాలని పదే పదే చెప్పా.. కానీ శాంతిభద్రతల పరిరక్షణ అనేది అధికారులకు అలవాటు తప్పిందని అన్నారు. గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారని.. ఇవాళ ధర్మబద్ధంగా చేయండని ప్రాథేయపడుతున్నా మీనమేషాలు లెక్కపెడుతున్నారని తెలిపారు. పోలీసు అధికారులు దేనికి మీనమేషాలు లెక్కబెడుతున్నారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

ANN TOP 10