తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. నల్గొండ జిల్లా గరిడేపల్లిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. రాష్ట్రంలో ఈ వానాకాలం 150 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం అన్నారు. సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్.
”ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ జరుగుతోంది. మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతులు, రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు అందరికీ మరోమారు అప్పీల్ చేస్తున్నా. ఈ నెల రోజుల పాటు రాష్ట్రంలో ప్రతీ రైతుకి తాను పండించిన ధాన్యానికి సునాయసంగా సేకరించే విధంగా మంచి మద్దతు ధరకి సేకరించే విధంగా ఈ ప్రొక్యూర్ మెంట్ లో అందరూ సహకరించాలని కోరుతున్నా.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ వానా కాలంలో ఎక్కువ వరి పంట ఈసారి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పంట 150 లక్షల మెట్రిక్ టన్నులు. ఎప్పుడూ కూడా ఇంత పంట పండలేదు. ఆ భగవంతుడు మనల్ని దీవిస్తున్నాడు. మన ప్రభుత్వాన్ని దీవిస్తున్నాడు. 150 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన రైతులందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. సన్న ధాన్యం ప్రోత్సహించడానికి రూ.500 బోనస్ ఇస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్ పీ 2వేల 320 రూపాయలకు అదనంగా సన్న రకాలకు క్వింటాల్ కు రూ.500 మేము ఇస్తున్నాం. గత ప్రభుత్వాలు ఇచ్చిన రేషన్ బియ్యం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు.. సన్న రకాలను ప్రోత్సహించేలా.. సంక్రాంతి తర్వాత తెలంగాణలోని రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ రేషన్ లో సన్నబియ్యం ఇవ్వబోతున్నాం” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.